కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ, వయనాడ్ స్థానాల నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రెండింటిలో ఒక సీటు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన వయనాడ్ ను వదులుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు భావోద్వేగంతో ఆయన ఓ లేఖ రాశారు.
తాను విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో వయనాడ్ ప్రజల ప్రేమాభిమానాలే తనను కాపాడాయని రాహుల్ గాంధీ అన్నారు. తనకు ఆశ్రయం కల్పించి, ఓ కుటుంబసభ్యుడిలా చూసుకున్నారని .. వయనాడ్‌ను వదులుకునే నిర్ణయాన్ని మీడియాకు చెప్పేందుకు చాలా బాధపడినట్టు తెలిపారు. ఐదేళ్లక్రితం తొలిసారి కలిసిన తనను, పెద్దగా పరిచయం లేకపోయినా అక్కడి ఓటర్లు గెలిపించారని వెల్లడించారు. రోజురోజుకీ తనపై వేధింపులు ఎక్కువైనప్పుడు అండగా నిలిచారని అన్నారు. వేలాదిమంది ఎదుట తన ప్రసంగాలను అనువాదం చేసేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన ధీరవనితల విశ్వాసాన్ని ఎలా మర్చిపోగలనని రాహుల్ పేర్కొన్నారు. వయనాడ్ ప్రజలంతా తన కుటుంబసభ్యులని ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని రాహుల్ హామీ ఇచ్చారు.