శతాబ్ద కాలంగా నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై గళం ఎత్తితే ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారు. శుక్రవారం దిల్లీలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి రాహుల్.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“ప్రజాస్వామ్యం మరణాన్ని మనం చూస్తున్నాం. శతాబ్దకాలంపాటు ఇటుక ఇటుక పోగేసి నిర్మించిన భారత దేశం మన కళ్ల ముందే ధ్వంసమైపోతోంది. నియంతృత్వానికి ఎదురు నిలిచినవారిపై దాడులు చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింస.. ఇలా ప్రజాసమస్యలేవీ ప్రస్తావించరాదన్నదే వారి ఆలోచన. నలుగురు, ఐదుగురు ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇద్దరు, ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు వ్యక్తులు నియంత పాలన సాగిస్తున్నారు.” అని మండిపడ్డారు రాహుల్ గాంధీ.
మరోవైపు.. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయ్ చౌక్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. జంతర్ మంతర్ మినహా న్యూదిల్లీలోని ఇతర అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు