కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న అర్ధరాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి.. డల్లాస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ.. విదేశీ గడ్డపై నుంచి భారత దేశ రాజకీయాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.
అమెరికాలోని టెక్సాస్ లోని భారత – అమెరికన్ కమ్యూనిటీ తో చిట్ చాట్ నిర్వహించిన రాహుల్ గాంధీ.. భారతదేశ రాజకీయాలలో ప్రస్తుతం ప్రేమ, గౌరవం, వినయం లాంటివి కొంచెం కూడా లేవన్నారు. ప్రధాని మోదీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని అందరికీ అర్థమైందన్నారు రాహుల్ గాంధీ. భారతదేశానికి ఒకే భావజాలం ఉందని ఆర్ఎస్ఎస్ భావిస్తుందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
రాహుల్ గాంధీ కి భారత్ ను అవమానించడం అలవాటైపోయిందని దుయ్యబట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన అలా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేసింది బిజెపి. సామాజిక ఉద్రిక్తతలను సృష్టించడానికే దేశాన్ని విభజించి పాలించాలని రాహుల్ భావిస్తూంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది.