లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ న్యాయ్పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమం సూత్రాలపై ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది కాంగ్రెస్ తయారుచేసిన మేనిఫెస్టో కాదని,, రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టో అని అభివర్ణించారు.
దేశంలోని అన్నివర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ఇవి 2024 ఎన్నికలు కావని, ప్రజాస్వామ్య పరిరక్షణకు యుద్ధం అని అన్నారు. భావసారూప్య పార్టీలతో ఎన్నికల బరిలోకి దిగామన్న రాహుల్ గాంధీ.. విజయం సాధించాక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ కలిసి ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తాయని చెప్పారు.
దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి, వాటిని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్న వారికి మధ్య ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు నెలకొంది అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ పోరాటంలో గెలిచిన తర్వాత, అత్యధిక మంది ప్రజల ప్రయోజనాలను చూసుకోవడం చాలా ముఖ్యమని తాము నమ్ముతున్నామని తెలిపారు.