పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్‌ను దోషిగా తేల్చడంపై సుప్రీం కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు వస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
తీర్పుపై స్టే విధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, శని, ఆది వారాలు పార్లమెంట్ ఉభయసభలకు సెలవు. దీంతో సోమవారం రాహుల్‌గాంధీ లోక్‌సభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల ప్రతులను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. ఆయనపై వేసిన అనర్హత వేటును రద్దు చేసేందుకు అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసి ఓం బిర్లా టేబుల్ ముందు ఉంచారు. వీటిపై ఆయన సంతకం చేస్తే.. రాహుల్ సభలోకి వెళ్లేందుకు వీలుంటుంది. రాహుల్ గాంధీ సోమవారమే పార్లమెంట్‌కు వస్తారా..? లేదంటే కొంత సమయం తీసుకుంటారా? అనే దానిపై స్పష్టత రాలేదు.