కాంగ్రెస్ ముఖ్య నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ త్వరలో బిహార్ లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీన ఆయన ఆ రాష్ట్రంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. పట్నాలో జరగనున్న ‘సంవిధాన్ సురక్షా సమ్మేళన్’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొననున్నట్లు వెల్లడించాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ చేపట్టనున్న నౌకరీ దో యాత్రలో పాల్గొననున్నట్లు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం రోజున ఢిల్లీలోని ఇందిరా భవన్ లో బిహార్ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో బీహార్‌కు చెందిన డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. బిహార్ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. జనవరి 18న, ఫిబ్రవరి 5వ తేదీన రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5 పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.