మోదీ వల్లే.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొద్దిసేపు ఆగింది : రాజ్​నాథ్ సింగ్

-

ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర నుంచి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వల్లే కొద్దిసేపు ఆగిందని అన్నారు. యుద్ధంతో కునారిల్లుతున్న ఉక్రెయిన్‌ నుంచి భారత విద్యార్థుల తరలింపు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆదివారం మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగిన వీర్‌ శిరోమణి మహారాణా ప్రతాప్‌ మహా సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ మాట్లాడారు. దాంతో యుద్ధం కొద్దిసేపు ఆగిపోయింది. ఆ తర్వాత విద్యార్థులు క్షేమంగా భారత్‌కు రాగలిగారు. మరే దేశమూ చేయలేని పనిని మోదీ చేశారు’ అని రాజ్‌నాథ్‌ గుర్తు చేసుకున్నారు.

అలాగే మహారాణా ప్రతాప్‌ చూపిన తెగువ, త్యాగాలను ప్రస్తావించారు. ‘రాణా ప్రతాప్‌ గడ్డితో చేసిన రోటీలు తిన్నారు. కానీ, ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీపడలేదు.’ అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version