భారత్ ప్రస్తుతం బలహీనమైన దేశం కాదని, సైనిక పరంగా ఎంతో శక్తిమంతంగా మారిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలనుకుంటోందని.. ఈ చర్చల ఫలితాలు ఎలా ఉండబోతేయో తెలుసుకునేందుకు కాస్త వేచి చూడాలని తెలిపారు. అలా అని భారత్ ఎప్పుడూ ఎవరి ఎదుట తలవంచదని స్పష్టం చేశారు. అలా ఎప్పటికీ జరగదని భరోసా ఇస్తున్నామని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. చైనాతో ఉన్న విభేదాలను ఎత్తిచూపుతూ మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. దేశీయంగా తయారైన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2014లో రూ.600 కోట్లు ఉండగా.. దాని విలువ 2023-24లో రూ.21 వేల కోట్ల మార్క్‌ను దాటిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.