క‌రోనా కాల‌ర్ ట్యూన్ నుంచి అమితాబ్ గొంతును తొల‌గించండి.. ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్‌..

క‌రోనా ప్ర‌భావం మొద‌లైన‌ప్ప‌టి నుంచి మ‌న‌కు ఫోన్ల‌లో ఓ లేడీ వాయిస్ కాల‌ర్ ట్యూన్‌గా వినిపిస్తూ వ‌చ్చేది. అయితే ప్ర‌స్తుతం టెలికాం కంపెనీలు బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ గొంతును క‌రోనా కాల‌ర్ ట్యూన్‌లో వినిపిస్తున్నాయి. క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెబుతూ అమితాబ్ రికార్డు చేసిన వాయిస్‌ను మ‌న‌కు కాల‌ర్ ట్యూన్ గా వినిపిస్తున్నారు. కానీ ఈ కాల‌ర్ ట్యూన్‌లో అమితాబ్ రికార్డింగ్‌ను తొల‌గించాల‌ని కోరుతూ ఇద్ద‌రు న్యాయ‌వాదులు ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు.

remove amitab bachan voice from corona caller tune petition filed in delhi high court

ఢిల్లీకి చెందిన అడ్వ‌కేట్లు ఏకే దూబే, ప‌వ‌న్ కుమార్‌లు ఢిల్లీ హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం (పిల్)ను దాఖ‌లు చేశారు. క‌రోనా క‌లార్ ట్యూన్ నుంచి అమితాబ్ గొంతును తొల‌గించాల‌ని వారు త‌మ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిష‌న్‌ను చీఫ్ జ‌స్టిస్ డీఎన్ ప‌టేల్‌, జ‌స్టిస్ జ్యోతి సింగ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది. ఈ క్ర‌మంలో విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 18వ తేదీకి వాయిదా వేశారు.

క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యం నుంచి ఎంతో మంది ఫ్రంట్ లైన్ వారియ‌ర్లు ప్ర‌జ‌ల‌కు సేవ చేశార‌ని, అందులో భాగంగా ఎంతో మంది చ‌నిపోయార‌ని, అలాగే ఎంతో మంది స్వ‌చ్ఛంద సేవ‌కులు, ఎన్‌జీవోలు ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బు తీసుకోకుండా ఉచితంగా సేవ‌ల‌ను అందించాయ‌ని ఆ న్యాయవాదులు త‌మ పిటిష‌న్‌లో తెలిపారు. అమితాబ్ సామాజిక కార్య‌కర్త కాద‌ని, అత‌ను డ‌బ్బే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేస్తాడ‌ని, క‌రోనా లాక్‌డౌన్ టైంలో అస‌లు అత‌ను ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ని, పైగా క‌రోనా బారిన అత‌ను, అత‌ని కుటుంబ స‌భ్యులు ప‌డ్డార‌ని, అలాగే అత‌నికి క‌రోనా కాల‌ర్ ట్యూన్‌కు కేంద్రం డ‌బ్బులు చెల్లిస్తుంద‌ని.. అందువ‌ల్ల అత‌ని వాయిస్ ను ఆ ట్యూన్ నుంచి తొల‌గించాల‌ని వారు కోరారు. ఈ సేవను ఉచితంగా అందించేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాగా ఈ పిటిష‌న్ పై కోర్టు ఏమ‌ని స్పందిస్తుందో చూడాలి.