ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన రివ్యూ ఆఫీసర్/ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ప్రశ్న పత్రం లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం నలుగురు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు లీక్ చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. పేపర్ లీకవ్వలేదని తొలుత అధికారులు చెప్పినప్పటికీ.. టాస్క్‌ఫోర్స్ ముమ్మర దర్యాప్తుతో నాలుగు నెలల తర్వాత అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
మొత్తం రెండు చోట్ల పేపర్ లీక్ కాగా.. ప్రయాగ్‌రాజ్‌లోని బిషప్ జాన్సన్ గర్ల్స్ హైస్కూల్ కేంద్రంలో పరీక్ష ప్రారంభానికి 4 గంటల ముందే ప్రశ్నపత్రం బయటకొచ్చినట్లు అధికారులు తేల్చారు. ఇంకొకటి ప్రింటింగ్ కేంద్రంలోనే లీకేజీ జరిగినట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 950కి.మీ దూరంలోని ఓ ప్రింటింగ్ కేంద్రంలో ప్రశ్నపత్రాలను ముద్రిస్తున్నట్లు ప్రధాన నిందితుడు రాజీవ్ నారాయణ్‌కు సమాచారం అంoడంతో తన స్నేహితుడు విశాల్ దుబే, అదే ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న సునీల్ రఘువంశీ, విశాల్ స్నేహితుల సాయంతో పేపర్ లీక్‌కు పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని యూపీ పోలీసులు వెల్లడించారు.