ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుటకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా నిన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని (MCRHRDI) సందర్శించి శిక్షణా అధికారులు, సిబ్బందితో సంభాషించారు. ఈ సంస్థ కార్యకలాపాల గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను తెలుసుకున్నారు.
అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి డి. అనసూయ (సీతక్క) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి MCRHRDI డైరెక్టర్ జనరల్ డా. శశాంక్ గోయల్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సంస్థ కార్యకలాపాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి డీజీ వివరించారు. దీంతో సీఎం రేవంత్ క్యాంపు కార్యాలయం జూబ్లీహిల్స్‌కు మారనుందా? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి జూబ్లీహిల్స్ లోనే ఉంది. దీంతో దాన్నే క్యాంపు ఆఫీసుగా మార్చనున్నారని సమాచారం.