అఫ్రిదీ గూబ గుయ్ మనిపించారుగా!

మరి ఆ మట్టిలోనే ఆ జబ్బు ఉందో లేక ఆ గాలిలోనే ఆ మూర్ఖత్వం ఉందో తెలియదు కానీ… ప్రపంచం మొత్తం ఒకలా ఆలోచిస్తే పాకిస్థాన్ మాత్రం మరోలా ఆలోచిస్తుంటుంది! తాజాగా ప్రపంచం మొత్తం కంటికి కనపడని కరోనా వైరస్ తో పోరాడుతుంటే పాకిస్థాన్ మాత్రం కశ్మీర్ పై మాట్లాడుతోంది. అక్కడ వారికి ఒరిగేది ఏమీ లేదని తెలిసినా… అప్పుడప్పుడూ భారత్ ను గిళ్లి శునకానందం పొందుతుంటుంది! అలాంటి ఆనందానికి అలవాటుపడిన పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి గూబ గుయ్ మనిపించాడు ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్! ఆ షాట్ కి బంతి స్టేడియం అవతల పడితే… అఫ్రిదీ గూబ నుంచి వచ్చిన సౌండ్ ప్రపంచం మొత్తం వినిపించిందనే చెప్పాలి!


తాజాగా షాహిద్ అఫ్రిదీ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లో స్పందిస్తూ.. కశ్మీర్ పైనా, భారత ప్రధాని నరేంద్రమోదీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారడంతో టీమ్ ఇండియా క్రికెటర్లు తమదైన శైలిలో స్పందించారు. ఈ విషయంలో మైందానంలో బంతిని ఎంత బలంగా బాదుతాడో అంతే బలంగా ఓపెనర్ శిఖర్ ధావన్ అఫ్రిదీ వ్యాఖ్యలకు దీటైన జవాబిచ్చాడు. “కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతుంటే.. మీరు మాత్రం కశ్మీర్ పైనే పడి ఏడుస్తున్నారు. కశ్మీర్ మాది.. మాతోనే ఉంటుంది.. ఎప్పటికీ మాదే. కావాలంటే 22 కోట్ల మందిని తీసుకురా.. మాలో ఒక్కొక్కరూ లక్షల మందితో సమానం” అని ఒక రేంజ్ లో ట్వీట్ చేశాడు ధావన్! ప్రస్తుతం ఈ ట్వీట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది!

ఇలా భారత్ క్రికెటర్లతో గూబలు పగలగొట్టించుకోవడం అఫ్రిదీకి కొత్తేం కాదు! అతడికి ఫస్ట్ చెంప చెళ్లుమనిపించింది గంభీరే! ఈ విషయంపై గంభీర్ తొలుత స్పందిస్తూ.. “అఫ్రిదీ 16 ఏళ్ల వృద్ధుడు, పాకిస్థాన్ లోని 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతుందని ఇటీవల అన్నాడు. అయినా కూడా వాళ్లు 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం యాచిస్తూనే ఉన్నారు.. పాకిస్థాన్ ప్రజల్ని మోసం చేయడానికన్నట్లు అఫ్రిదీ, ఇమ్రాన్ ఖాన్, బజ్వా లాంటి జోకర్లు భారత్ పై, ప్రధాని మోదీపై విషం చిమ్ముతున్నారు.. మీరెప్పటికీ కశ్మీర్ ను పొందలేరు” అని దీటుగా వ్యాఖ్యానించాడు.