సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, అర్చక సంఘాలతో పాటు బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తోంది. ఉదయనిధి వ్యాఖ్యలతో ఇండియా కూటమి స్వభావం తేలిపోయిందని ఆరోపిస్తోంది. ఉదయనిధిపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ బీజేపీ నేతల బృందం తమిళనాడు గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి కూడా చేసింది. ఈ క్రమంలో సీఎం స్టాలిన్, ప్రకాష్ రాజ్ స్పందించారు. కొడుకు వ్యాఖ్యలను సమర్దిస్తూ మాట్లాడడం హాట్ టాపిక్ అయింది.
దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ఎందుకు మాట్లాడరని స్టాలిన్ నిలదీశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మతాన్ని ఆయుధంగా వాడుకుంటోందని విమర్శించారు. గుజరాత్ అల్లర్లు, మణిపూర్ హింసాత్మక ఆందోళనలు, హర్యానాలో గొడవలను ప్రస్తావించిన ఆయన, బీజేపీని ఇప్పటికైనా నిలువరించకపోతే దేశాన్ని, దేశంలోని ప్రజలను ఎవరూ రక్షించలేరని వ్యాఖ్యానించారు. మరోవైపు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలకు మద్దతు పలకడంతో పాటు, సనాతన పార్లమెంట్ భవిష్యత్తు ఇలా ఉంటుందా అంటూ స్వామీజీలతో కలిసి ఉన్న ప్రధాని మోదీ ఫొటోను షేర్ చేశారు.
ఇదిలావుంటే ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ జాతీయ అంశంగా మలుచుకుంటూ ఇండియా కూటమిపై విమర్శల దాడికి దిగడంతో కూటమిలోని ఇతర పార్టీలు రంగంలోకి దిగాయి. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్, శివసేన పార్టీలు ప్రకటించాయి. అన్ని మతాలను గౌరవించడమే కాంగ్రెస్ స్వభావమని తేల్చి చెప్పాయి. సనాతన ధర్మం శాశ్వతమైన సత్యాన్ని సూచిస్తుందని, ఎన్నో ఆక్రమణదారుల దాడులను తట్టుకొని నిలబడగలిగిందని స్పష్టం చేశాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వ్యక్తిగతమని, దీన్ని ఇండియా కూటమి మొత్తానికి ఆపాదించడం సరికాదని సూచించాయి.