అయోధ్య రాముడికి తెలంగాణ నుంచి మరో కానుక వెళ్లనుంది. రాష్ట్రంలోని సిరిసిల్ల చేనేత కార్మికుడు అయోధ్య రాముడి పాదాల చెంతన ఉంచేందుకు ఓ అందమైన బంగారు చీరను రూపొందించాడు. సిరిసిల్లకు చెందిన హరి ప్రసాద్ నేసిన బంగారు చీరను ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా ఈ చీరను బాలరాముడి పాదాల చెంత ఉంచనున్నారు.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. ఈ బంగారు చీరను పరిశీలించి అద్భుతంగా ఎంతో అందంగా ఉందంటూ ప్రశంసించారు. ఈ చీరపై శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను పొందుపర్చారు. మరోవైపు ఈ చీరను నేయడానికి 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి ఉపయోగించినట్లు హరి ప్రసాద్ తెలిపారు. చీర నేసేందుకు20 రోజులు పట్టిందని చెప్పారు.
మరోవైపు జనవరి 22వ తేదీన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ అద్భుత ఘట్టానికి యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇంకోవైపు జనవరి 22వ తేదీన ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.