అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 16వ తేదీ నుంచి రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే గురువారం రోజున బాలరాముడిని గర్భగుడిలోకి తీసుకువచ్చారు. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం యావత్ భారతావని ఎంతో ఆసక్తిగా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా జనవరి 22వ తేదీన కొన్ని రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. మరి అవి ఏయే రాష్ట్రాలో చూద్దామా?
అయోధ్య కేంద్రమైన ఉత్తరప్రదేశ్లో జనవరి 22వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఆ రాష్ట్ర సర్కార్ సెలవు ప్రకటించింది. అంతే కాకుండా ఆ రోజున రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గోవా, ఛత్తీస్‌గఢ్లోనూ ఆరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాలిడే ఇచ్చారు. మరోవైపు మధ్యప్రదేశ్, హర్యానాలో జనవరి 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడమే గాక మద్యం, మాంసం దుకాణాలు మూసివేయనున్నట్లు నిర్ణయించారు.