లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలతో అరెస్టయిన హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రజ్వల్‌కు పురుషత్వ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఇందుకోసం సంబంధిత న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో.. ఆయనను ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు బౌరింగ్ ఆసుపత్రికి తీసుకువెళ్లి బుధవారం రోజున పరీక్షలు చేయించారు. మొత్తం మూడు రకాల పరీక్షలు చేయిస్తున్నామని సిట్ అధికారులు తెలిపారు.
మరోవైపు కొందరు ప్రజ్వల్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా విక్రయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సిట్, పోలీసులు గుర్తించారు. పెన్ డ్రైవ్‌లను, ఇతర విధానాల్లో ఆ వీడియోలను వితరణ చేసినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడి సిట్ కస్టడీ ఇవాళ్టితో (జూన్ 6వ తేదీ) ముగియనుంది. విచారణకు ప్రజ్వల్ సహకరించకుండా ఇబ్బంది పెడుతున్నారని సిట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రజ్వల్ రాజకీయ భవిష్యత్తుకు ఉన్న అన్ని మార్గాలూ మూసుకుపోయాయి.