కేంద్ర రాజకీయాలను పరిశీలిస్తే.. తాజాగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రభుత్వాధినేత, బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ.. ఇప్పటికే అనేక రూపాల్లో అనేక విషయాలపై యుద్ధం ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఏ ఒక్క విషయంలోనూ విజయం సాధించలేక పోయారు. జమ్ము కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, 35 ఏ, శబరిమలలో మహిళా ప్రవేశం, కరోనా చికిత్సల్లో వైఫల్యం, రాష్ట్రాల అధికారాల్లోకి కేంద్రం జొరబడడం ఇలా అనేక విషయాల్లో మోడీ దూకుడు ప్రదర్శించారు. ఇక, అయోధ్యయలో రామమందిరం నిర్మాణానికి ఏకంగా ఆయన శంకుస్థాపన చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే.. గాంధీని, వల్లబాయ్ పటేల్‌ను కూడా బీజేపీ పంచన చేర్చుకునే విషయంలోనూ మోదీ దూకుడు చూపించారు.
ఇక, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కల్లోలం సృష్టించి, ప్రభుత్వాలను పడదోసే క్రతువు చేపట్టి.. కర్ణాటకలో సక్సెస్ అయ్యారు. ఒక్క రాజస్తాన్‌లో మాత్రమే మోడీ ఫెయిలయ్యారు. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ను అధికార పీఠం నుంచి దించేసి.. తాము గద్దె ఎక్కారు. అయితే, ఆయా సందర్భాల్లో సోనియా సహా కాంగ్రెస్ నాయకులు ఎన్ని అరుపులు, హూంకరింపులు చేసినా.. మోడీని నిలువరించలేక పోయారు. గాంధీని మోడీ భుజాన ఎత్తుకుని, కాంగ్రెస్ ఆయనకు విలువ ఇవ్వలేదని చెప్పినప్పుడు కూడా ఎదురు దాడి చేయడంలో సోనియా విఫలయ్యారు.
ఇలా ప్రతి విషయంలోనూ ఇప్పటి వరకు మోడీదే పైచేయి. పైగా ఇటీవల కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం తలెత్తినప్పుడు.. దీని వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందనే వాదన వచ్చింది. అయినప్పటికీ.. సోనియా.. ఈ వివాదాన్ని తాత్కాలికంగా నిలువరించారే తప్ప.. ఫుల్ స్టాప్ మాత్రం పెట్టలేక పోయారు. ఇలా మోడీపై విజయం సాధించే ప్రయత్నం చేస్తూ.. చతికిల పడుతున్న ప్రతిపక్షంగా కాంగ్రెస్ రికార్డు సాధిస్తోంది. తాజాగా మరో వివాదాన్ని సోనియా లేవనెత్తారు. అదే.. నీట్, జేఈఈ పరీక్షలు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు మోడీ సర్కారు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీనికి సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే.. సోనియా మాత్రం ప్రతిపక్షాలను, మోడీ వ్యతిరేకులను కూడగట్టి.. ప్రభుత్వంపైపోరాటానికి రెడీ అయ్యారు. అయితే, ఈ జాబితాలో ఏపీ సీఎం, తెలంగాణ సీఎం, తమిళనాడు, కేరళ సీఎంలు కలవకపోవడం, పైగా మహారాష్ట్రలో తమ పార్టీ మిత్రపక్షం, అధికారంలో ఉన్న ఉద్దవ్ ఠాక్రే కూడా జతకలవకపోవడం వంటివి సోనియాకు తీవ్ర ప్రతిబంధకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి మోడీని కెలికి సాధించేదిఏమీలేదని అంటున్నారు పరిశీలకులు.