ఒక తీర్పు-ఒక వ్య‌వ‌స్థ‌-అనేక సందేహాలు..!

-

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.. అన్న‌ట్టుగా దాదాపు 28 సంవ‌త్స‌రాల పాటు దేశాన్ని కుదిపేసిన ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని.. బాబ్రీ మ‌సీదు కూల్చివేత ఘ‌ట‌న‌కు సంబంధించి.. తాజాగా సీబీఐ ప్ర‌త్యేక కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దాదాపు వారం నుంచి కూడా ఈ తీర్పుపై చాలా ఉత్కంఠ నెల‌కొంది. దీనికి కారణం.. బీజేపీ అగ్ర‌నేత‌.. గ‌తంలో ర‌థ‌యాత్ర నిర్వ‌హించిన ఎల్‌కే ఆద్వానీ, ఆర్ ఎస్ ఎస్ నాయ‌కుడు ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, కేంద్ర మాజీ మంత్రి, సాధ్వి ఉమాభార‌తి స‌హా మొత్తం 32 మంది భ‌విత‌వ్యం తెలిసి పోతుంద‌ని. వీరికి క‌ఠినాతి క‌ఠినంగా శిక్ష‌లు, భారీ ఎత్తున జ‌రిమానాలు ప‌డ‌తాయ‌ని.. ఓ వ‌ర్గం విశ్లేష‌కులు పేర్కొంటూ వ‌చ్చారు.

ఇక‌, బీజేపీకి సానుకూలంగా ఉన్న ఓ వ‌ర్గం కూడా.. ఈ కేసులో సీబీఐ తీర్పు సంచ‌ల‌నంగా ఉంటుంద‌నే భావించింది. మ‌రీముఖ్యంగా కీల‌క నిందితులుగా ఉన్న ఉమాభార‌తి, ఎల్ కే ఆద్వానీ వంటివారికి శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని భావించింది. అదేవిధంగా ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషికీ శిక్ష ఖ‌రార‌వుతుంద‌ని అంచ‌నా వేసింది. కానీ.. అనూహ్యంగా సీబీఐ ప్ర‌త్యేక కోర్టు 32 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ కేసును కొట్టివేయ‌డం దేశాన్ని మ‌రింత సచ‌ల‌నంలోకి నెట్టేసింది. ఈ తీర్పుతో సీబీఐ వ్య‌వ‌స్థ‌పై స‌హా.. విచార‌ణ ప‌రిధుల‌పైనా అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది.

క‌ళ్ల ముందు కూలిపోయిన‌.. బాబ్రీమ‌సీదు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం కాగా.. క‌ర‌సేవ‌కుల‌ను ప్రోత్స‌హించార‌నే కేసులు ఎదుర్కొంటున్న‌వారు కూడా మ‌న ముందే ఉన్నారు. కానీ, వ్య‌వ‌స్థీ కృత త‌ప్పిద‌మ‌ని, దీనిలో ఎవ‌రి పాత్ర‌నూ సీబీఐ నిగూఢంగా నిరూపించ‌లేక పోయింద‌ని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు వ్యాఖ్యానించ‌డం న్యాయ కోవిదుల‌ను కూడా విస్మ‌యానికి గురిచేసింది.

లౌకిక దేశంలో స‌ర్వ‌మ‌త స‌మాన‌త్వాన్ని పాటించాల‌న్నా రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం క‌లిగించేలా జ‌ర‌గిన ఈ ఘ‌ట‌న‌పైవ‌చ్చిన తీర్పును ముస్లిం వ‌ర్గాలు ముక్త‌కంఠంతో వ్య‌తిరేకించ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. ఒక తీర్పు..ఒక వ్య‌వ‌స్థ‌పై అనేక సందేహాల‌ను మిగిల్చింద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news