స్వలింగ వివాహాలపై కేంద్రానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్న

-

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతపై గురువారం రోజున సుప్రీం కోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి కొన్ని కీలక ప్రశ్నలను సంధించింది. స్వలింగ వివాహాలకు గుర్తింపునివ్వని పరిస్థితుల్లో ఆ దంపతులు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అర్హులవుతారా? అని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పలు సందేహాలను వ్యక్తం చేసింది.

కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా…ప్రేమించే హక్కు, కలిసి జీవించే హక్కు, భాగస్వామిని ఎంచుకునే హక్కు, లైంగిక ధోరణి వంటివాటిని పౌరులు ప్రాథమిక హక్కులుగా కలిగి ఉంటారని తెలియజేయగా ధర్మాసనం నోట్‌ చేసుకుంది. అయితే, ఆయా వ్యక్తుల మధ్య ఉండే అనేక బంధాలను వివాహం పేరుతోనో, మరో సామాజిక బంధం పేరుతోనో గుర్తించమని కోరడం వారి ప్రాథమిక హక్కు కాబోదని మెహతా స్పష్టం చేశారు. వ్యక్తిగత సంబంధాలన్నిటినీ చట్టబద్ధం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని తెలిపారు.

‘సహజీవన హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిన తర్వాత దానికి అనుబంధంగా వర్తించే సామాజిక బాధ్యతలు ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. వివాహం విషయాన్ని పక్కన ఉంచి మిగతా వాటి విషయానికి వస్తే… గ్రాట్యూటీ, ప్రావిడెంట్‌ ఫండ్‌, ఆస్తుల వారసత్వం, పాఠశాలలో విద్యార్థులకు తల్లిదండ్రులుగా వ్యవహరించడం వంటి అంశాల్లో తలెత్తే వివాదాలను ఎలా పరిష్కరిస్తారో ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖల ద్వారా తెలియజేయాల’ని సొలిసిటర్‌ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అనంతరం మే 3వ తేదీకి విచారణ వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version