ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకశ్మీర్ ప్రజలంతా కోరుకున్నా.. ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసే యంత్రాంగం మన దగ్గర లేదా అని ప్రశ్న లేవనెత్తింది. ఒకవేళ లేదని భావిస్తే.. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తరహాలోనే ఈ ఆర్టికల్‌కు ప్రత్యేక తరగతిని సృష్టిస్తున్నామా.. అన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ఆర్టికల్ 370ని రద్దు లేదా మార్పుచేసే అధికారం కేవలం జమ్మూకశ్మీర్ రాజ్యాంగ సభకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఆ సభ 1957లోనే రద్దైందని, కాబట్టి ఎవరికీ ప్రత్యేక హోదాను తొలగించే హక్కు లేదన్న వాదన వినిపించారు. ఈ సమయంలో సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ.. పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ చేసే అధికారమిచ్చే ఆర్టికల్ 368 కింద కూడా కుదరదా అని అడిగారు. దీనికి సిబల్ కుదరదంటూ బదులిచ్చారు.
మరి అలాంటప్పుడు అధికరణం 370 రద్దు చేయడానికి సరైన ప్రక్రియ ఏమిటి..? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సిబల్ ‘‘ఈ విచారణ ఉద్దేశం.. సరైన పద్ధతిలో రద్దు చేయడానికి సమాధానాలు వెతకడం కాదు. రద్దుకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియ సరైందా కాదా అని తేల్చడం. రాజ్యాంగ సభతోనే మాత్రమే అధికరణం 370లో మార్పులు చేయగలం. పార్లమెంటుతో కాదు.’’ అని తెలిపారు. ఈ అంశంపై పిటిషనర్ల తరఫున న్యాయవాదులు, కేంద్ర ప్రభుత్వం కూడా తన వాదనలు వినిపించాల్సి ఉంది. తదుపరి వాదనలు మంగళవారం రోజున ధర్మాసనం విననుంది.