కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు కేసు విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ అధికారులు సోమవారం రోజున ఆర్.జి.కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను విచారించారు వైద్యురాలి మరణం విషయం తెలిసిన వెంటనే ఆయన ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆరా తీశారు. ఘటన తరవాత ఎవరెవరు సంప్రదించారు? బాధితురాలి తల్లిదండ్రులను మూడు గంటలపాటు ఎందుకు ఎదురుచూసేలా చేశారని సీబీఐ అధికారులు సందీప్ ఘోష్ను నిలదీశారు.