ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలపైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా.. ఎన్నికల బాండ్ల పథకం గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని.. ఈ స్కీమ్ అమల్లో కొన్ని ముఖ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరు. కానీ విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదు. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుంది. అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.
ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధన ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని.. స్వచ్ఛమైన డబ్బే పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసిందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయని.. బాండ్ల ద్వారా సమకూరిన మెుత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. అలా చేస్తే అసలు విరాళాలే రావని సొలిసిటర్ జనరల్ మెహతా అభిప్రాయపడ్డారు. ఈ కేసుపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి.