కేసుల దర్యాప్తుల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టప్రకారం వ్యవహరించాలని ఈడీ అధికారులకు సూచించింది. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్ అరెస్టును కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
మనీలాండరింగ్ కేసులో జూన్ 1వ తేదీన అరెస్టయిన ఎం3ఎం డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్‌పై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు జూన్ 9న పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. జులై 5 వరకు కోర్టు వారికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించగా.. జూన్ 14న వారిని ఈడీ అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఈ అరెస్టును సవాలు చేస్తూ బన్సల్ బ్రదర్స్ పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించారు.
వారి పిటిషన్ను హరియాణా కోర్టు కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. వారికి బెయిల్ మంజూరు చేస్తూ.. ఈడీ ప్రతి చర్య పాదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. కానీ, ఈ కేసులో దర్యాప్తు సంస్థ తన అధికారాలను, విధులను అనుసరించడంలో విఫలమైనట్లు తేలిందని పేర్కొంది. ఈడీ అడిగిన ప్రశ్నలకు నిందితులు సమాధానాలు చెప్పలేదన్న కారణంతో వారిని అరెస్టు చేయడం సరికాదని వ్యాఖ్యానిస్తూ వారికి బెయిల్ మంజూరు చేసింది.