నీట్ యూజీ – 2024 పరీక్షలో అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఇవాళ జస్టిన్ విక్రమ్ నాథ్, జస్టిస్ అమనుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. పరీక్షను క్యాన్సిల్ చేయడం అంత సులువు కాదని ధర్మాసనం తెలిపింది.
‘‘ఇది మీరు అనుకున్నంత సులభం కాదు. అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవితత్ర దెబ్బతింటాయి. అందువల్ల ఈ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. దీనిపై స్పందన తెలియజేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. ఇక, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా ఎన్‌టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.