బిహార్ కులగణనపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు

-

బిహార్‌లో ఇటీవల నితీశ్​ కుమార్​​ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కుల గణనపై తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుల గణన సర్వే వివరాలను ప్రచురించాల్సిన అవసరం ఏం వచ్చిందని నితీశ్ సర్కార్​ను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు ఈ వివరాలు ప్రచురించకుండా ఉండేందుకు ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.

కులగణన సర్వే వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘిస్తోందని, దీనిపై స్టే విధించాలంటూ.. కులగణన కోసం బిహార్​ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఏక్ సోచ్ ఏక్ పర్యాస్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు నలందాకు చెందిన అఖిలేష్ కుమార్ సహా పలువురు దాఖలు చేసిన పిటిషిన్​లపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషనర్ల అభ్యర్థనలను తోసిపుచ్చింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం సరికాదని.. విధాన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించడం తప్పు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా కులగణన డేటాను ఎందుకు ప్రచురించాల్సి వచ్చింది? అని నితీశ్​ సర్కార్​ను ప్రశ్నించింది. విధాన రూపకల్పనకు కులగణన డేటా ఎంత అవసరమో పట్నా హైకోర్టు ఉత్తర్వుల్లో సవివరంగా స్పష్టం చేసిందని జస్టిస్ సంజీవ్​ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం​ పిటిషనర్లకు తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను 2024 జనవరికి జాబితా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news