ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. ముందస్తుగా కొంతమంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు. రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై ప్రత్యేక దృష్టి సారించి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తమయ్యారు.
సుప్రీం కోర్టు తీర్పును ఎవరూ రాజకీయం చేయరాదని, దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని బీజేపీ కోరింది. 370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు తమ పార్టీ ఎటువంటి విఘాతం కలిగించబోదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి ఎదురైతే న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమైందని సుప్రీం తీర్పు స్పష్టం చేస్తుందని పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు రావచ్చని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.