28 కిలోల జయలలిత నగలు వేలం

-

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు.  అక్రమాస్తుల కేసులో 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు నాలుగేళ్ల జైలు శిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో అప్పీల్‌ చేయగా.. కేసు విచారించిన హైకోర్టు నలుగురిని విడుదల చేస్తూ తీర్పును ఇచ్చింది. అనంతరం కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. పిటిషన్‌ విచారణ సమయంలో 2016 డిసెంబరు 5న జయలలిత మరణించారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుని సమర్థించింది. జయలలిత మరణించి ఆరేళ్లుకాగా ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఆమె ఇంట్లో అవినీతి నిరోధకశాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు నగలు, 800 కిలోల వెండి నగలు, వజ్రాల నగలను కోర్టులో అప్పగించారు. ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు నగలను మార్చి 6, 7 తేదీల్లో తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news