ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మంది మరణించారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు.
ఈ రైలు ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ప్రమాద నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. చెన్నైలోని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ప్రమాదం జరిగిన ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతానికి తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, శివ శంకర్, అనిల్ మహేశ్ బయల్దేరారు.
మరోవైపు రైలు ప్రమాదం చోటుచేసుకున్న ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్‌లో ప్రత్యేక బృందాలను పంపారు. సహాయక చర్యల్లో ఎన్టీఆర్‌ఎఫ్, ఓడిఆర్‌ఎప్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొంటున్నారు. సహాయక చర్యలను రైల్వే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.