తమిళనాడును మళ్లీ వరణుడు వణికిస్తున్నాడు. ఇటీవలే మిగ్జాం తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ విలయం నుంచి బయటపడకముందే మరోసారి తమిళ ప్రజలను వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోతగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. అధికారులు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఓవైపు చలి మరోవైపు వర్షాలతో తమిళ ప్రజలు వణికిపోతున్నారు.
ఆదివారం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వానలకు అనేక జిల్లాల్లో రికార్డు వర్షపాతం నమోదైంది. పాలయంకొట్టాయ్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కన్యాకుమారిలో 17 సెంటీమీటర్లు, తూతుకూడి జిల్లా శ్రీవైకుంఠం తాలుకాలో52 సెంటీ మీటర్ల రికార్డు వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. విరుద్ నగర్ జిల్లాను. వర్షాలు ముంచెత్తగా జిల్లా కలెక్టర్ సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తిరునల్వేలి, తూతుకూడి, కన్యాకుమారి, తెన్కాసి జిల్లాల్లో విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.