కరోనా ఆంక్షలు సడలించిన తర్వాత చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు ముగింపు పలికాయి. అనంతరం వారంలో మూడ్రోజులు తప్పకుండా ఆఫీసుకు రావాలనే నిబంధనను పెట్టాయి. ఇందులో భాగంగానే టీసీఎస్ కూడా హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తోంది. అయితే దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ఉద్యోగులకు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తోంది.
హైబ్రిడ్ విధానంలో నెలకు 12రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనను పట్టించుకోని వారికి తాజాగా నోటీసులు పంపించడం మొదలుపెట్టిన టీసీఎస్.. రోస్టర్ ప్రకారం నిర్దేశించిన కార్యాలయానికి తక్షణమే వచ్చి రిపోర్టు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని ఉద్యోగులకు జారీ చేసిన మెమోల్లో హెచ్చరించినట్లు సమాచారం.
‘గత రెండేళ్లుగా కంపెనీలో ఎంతో మంది కొత్తగా నియమితులయ్యారు. నేర్చుకోవడం, కలిసి పనిచేయడం, వృద్ధి చెందడం, తోటి ఉద్యోగులతో ఉల్లాసంగా గడపడంతోపాటు సంస్థలో పని వాతావరణం అలవరచుకోవడం కూడా వారికి ఎంతో ముఖ్యం. సంస్థకు చెందినవారమనే భావనతోపాటు కలిసి పనిచేసేతత్వానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది’ అని టీసీఎస్ పేర్కొంది.