కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకం ప్రారంభించి మూడు సంవత్సరాలు గడిచింది. మూడేళ్లుగా ఈ పథకం విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ పథకం మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర సర్కార్ దిల్లీలో జూన్ 1 నుంచి 3 వరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది. విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు, ఇద్దరు వీధి వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఎంపికైన అధికారుల్లో మెప్మా కేంద్ర కార్యాలయానికి చెందిన కృష్ణచైతన్య, శివకుమార్. ఎంపికైన ఇద్దరు వీధి వ్యాపారుల్లో ఒకరు వరంగల్ నగరానికి చెందిన మహ్మద్ మహబూబ్ పాషా కాగా, మరొకరు సిరిసిల్లకు చెందిన గడ్డం కృష్ణయ్య ఉన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గేటు వద్ద టీస్టాల్ నిర్వహిస్తున్న మహబూబ్ పాషా కొవిడ్-19 కారణంగా వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు. పీఎం స్వనిధి పథకంతో తొలి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల రుణం తీసుకుని వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకున్నారు.