సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ కు రంగం సిద్ధం అవుతోంది. సోమవారం రోజున ఐదో దశ పోలింగ్ జరగనుంది. అయితే పోలింగ్ వేళ జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్, షోపియాన్‌లో ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పర్యటకులు గాయపడ్డారు.
దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మాజీ సర్పంచ్, బీజేపీ నాయకుడు ఐజాజ్ షేక్ తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం వద్ద శనివారం రాత్రి యన్నర్‌లోని పర్యటకుల రిసార్టు వద్ద పర్యటకుల క్యాంప్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాజస్థాన్‌కు చెందిన ఓ జంట గాయపడ్డారు. గాయపడిన వారిని తబ్రేజ్, ఫర్హాగా గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో అనంత్‌నాగ్, షోపియాన్‌లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మరోవైపు ఈ ఘటనను బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు ఖండించాయి. పోలింగ్ వేళ పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని కోరాయి.