పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రైల్వే శాఖ మాజీ మంత్రి ముకుల్ రాయ్ బాత్ రూమ్‌లో జారిపడి తలకు గాయంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వైద్యులు అతనిని 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
గురువారం తెల్లవారుజామున ముకుల్ రాయ్ తన నివాసంలోని బాత్‌రూమ్‌లో జారి పడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, 70 ఏండ్ల ముకుల్ రాయ్ టీఎంసీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన 2017లో బీజేపీలో చేరారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర కృష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత గతేడాది జులైలో అతను తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.