ట్రాక్టర్​ నడిపిన యువతి.. ఊరి నుంచి బహిష్కరించిన గ్రామస్థులు

-

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. అంతరిక్షంలోకి సైతం దూసుకెళ్తున్న ఈరోజుల్లో.. ట్రాక్టర్​ దున్ని వ్యవసాయం చేస్తే గ్రామానికి చెడు జరుగుతుందని గ్రామ బహిష్కరణ చేశారు జనం. ఎంతో ఆధునిక ఆలోచనలు ఉన్న యువతి.. గ్రామస్థుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యవసాయం చేయడాన్ని ఆపబోనని స్పష్టం చేసింది.

ఝార్ఖండ్​ గుమ్లాలోని శివనాథ్​పుర్​ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మంజు ఓరన్​.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ చేయడం ప్రారంభించింది. ఆమెకు ఉన్న ఆరు ఎకరాల పొలంతో పాటు మరో 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని.. వరి, టొమాటో, బంగాళదుంపను పండిస్తోంది. గతేడాది వచ్చిన ఆదాయంతో ఓ పాత ట్రాక్టర్​ను కొనుగోలు చేసి.. స్వయంగా పొలాన్ని దున్నుతోంది. దీనిని గమనించిన గ్రామస్థులు.. మహిళలు ట్రాక్టర్​ నడపితే చెడు జరుగుతోందని.. దీని వల్ల గ్రామంలో కరవు వస్తుందని నమ్మారు.

మంజు ట్రాక్టర్​తో దున్నడం వల్ల గ్రామానికి చెడు జరుగుతుందని.. వెంటనే నిలిపివేయాలని ఆమెను వారించారు. గ్రామ కట్టుబాట్లను దాటినందుకు గాను ఆమెకు జరిమానా విధించారు. పంచాయతీ నిబంధనలను అతిక్రమించినందుకు మంజును గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న మంజు ఓరన్.. గ్రామస్థులు చేసిన తీర్మానాన్ని తిరస్కరించింది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. అంతరిక్షంలోకి సైతం వెళుతున్నారని.. అలాంటప్పడు తాను వ్యవసాయం చేయడం ఎందుకు చేయొద్దంటూ ప్రశ్నించింది. తనకు వ్యవసాయం అంటే చాలా మక్కువని చెప్పింది. గ్రామ పంచాయతీ విధించిన షరతులను తాను అంగీకరించబోనని.. వ్యవసాయం చేయడాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news