ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా ఇవాళ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా జరుగుతుందని ప్రకటించారు. ఇంకా వర్షం పడుతూనే ఉంది. దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందా..? లేదా అని ఐపీఎల్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి రాత్రి 10.54 గంటల వరకు మ్యాచ్ ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి.
అప్పటిలోపు వర్షం ఆగితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ సాధ్యం అవుతుందని అపైర్లు తెలిపారు. అప్పటికీ వాన తగ్గకపోతే మ్యాచ్ ను రద్దు చేసి చెరో పాయింట్ ని ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిన్న స్వామి స్టేడియం వద్ద చిరు జల్లులు మాత్రమే కురుస్తున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. అయితే వర్షం తగ్గగానే.. కవర్స్ తొలగిస్తామని ప్రకటించారని తెలుస్తోంది. మరోవైపు స్టేడియం వద్దకు వచ్చినటువంటి అభిమానులు మాత్రం వర్షం తగ్గాలని.. మ్యాచ్ జరగాలని ప్రార్థనలు చేస్తున్నారు.