ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడం ఇప్పుడు ముంబయిలో కలకలం రేపుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఇలా బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే అకౌంట్ నుంచి మెయిల్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదటి బెదిరింపులో రూ.20 కోట్లు డిమాండ్ చేసిన సదరు వ్యక్తులు.. రెండోసారి రూ.200 కోట్లు.. ఇప్పుడు ఏకంగా రూ.400 కోట్లు డిమాండ్ చేశారు.
ఈ సారి మెయిల్లో ఆ ఆగంతకులు.. భారత్‌లో తమ వద్ద మంచి షూటర్లు ఉన్నారని.. తాము అడిగిన మొత్తం రూ.400 కోట్లు ఇవ్వకపోతే ముకేశ్ అంబానీని కాల్చి చంపేస్తామని బెదిరించారు. సోమవారం రోజున వచ్చిన ఈ మెయిల్‌పై ముంబయిలోని గామదేవి పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ముకేశ్ అంబానీ ఇంట్లో సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. మరోవైపు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి దీని వెనక ఉంది ఎవరో కనిపెడతామని ముంబయి పోలీసులు తెలిపారు.