బెంగాల్‌లో మోదీ సమావేశం నిర్వహించిన 18 చోట్లలో 10 స్థానాల్లో టీఎంసీ గెలుపు..!

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ బంపర్‌ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. మొత్తం 292 స్థానాలకు గాను టీఎంసీ 213 చోట్ల గెలిచి సత్తా చాటింది. నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసిన దీదీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై ఓడినా పార్టీ మాత్రం మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మొత్తం 18 చోట్ల ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. వాటిల్లో 10 చోట్ల టీఎంసీ గెలవడం విశేషం.

tmc win in 10 places out of 18 places where pm modi held public meetings in bengal

బెంగాల్‌లోని చౌరింగీలో టీఎంసీ అభ్యర్థి నైనా బంధోపాధ్యాయ బీజేపీ అభ్యర్థి దేవదత్త మాజీని ఓడించారు. జయానగర్‌లో టీఎంసీకి చెందిన బిశ్వనాథ్‌ దాస్‌, ఉలుబేరియా పర్బాలో బిదేష్‌ రంజన్‌ బోస్‌, హరిపాల్‌లో డాక్టర్‌ కరాబి మన్నా, సోనార్‌పూర్‌ దక్షిణ్‌లో లవ్లీ మిత్రా, హౌరా సెంట్రల్‌లో అరుప్‌ రాయ్‌, కృష్ణ నగర్‌ దక్షిణ్‌లో ఉజ్వల్‌ బిశ్వాస్‌, బర్దమాన్‌ ఉత్తర్‌లో నిషిత్‌ కుమార్‌ మాలిక్‌, బరాసత్‌లో చిరంజిత్‌ చక్రవర్తి, జమురియాలో బర్దమాన్‌ హరే రామ్‌లు గెలిచారు. వీరందరూ టీఎంసీ అభ్యర్థులు.

ఇక మిగిలిన 8 చోట్లైన పురులియా, సిలిగురి, ఖరగ్‌పూర్‌ సదర్, కూచ్‌బెహర్‌ దక్షిణ్‌, బన్‌కురా, కాంతి దక్షిణ్‌, కల్యాణి, గంగారామ్‌పూర్‌లలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మొత్తం 18 చోట్ల మోదీ ప్రచారం చేస్తే వాటిల్లో 10 చోట్ల టీఎంసీ గెలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయా ప్రదేశాల్లో మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ మార్పును కోరుకుంటుందని, దోపిడీ నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పిస్తామని, దీదీ ప్రభుత్వం అవినీతిమయం అయిందని మోదీ అన్నారు. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు మోదీని నమ్మలేదు. దీదీకే పట్టం కట్టారు.