రూ.2 వేల నోట్ల డిపాజిట్‌కు ఆర్బీఐ విధించిన గడువు నేటితో ముగియనుంది. అయితే ఈ వ్యవధిని మరోసారి పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కొన్ని బ్యాంకుల్లోకి రెండు వేల నోట్లు రావడం పూర్తిగా ఆగిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.
మే 19వ తేదీన రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం సెప్టెంబరు 30ని చివరి తేదీగా ప్రకటించింది. ఇప్పటి వరకు 93 శాతం రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. ఇంకా రూ.24 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు రావాల్సి ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే గడువును అక్టోబరు 31 వరకూ పొడిగించే అవకాశాలున్నాయని సమాచారం. ప్రవాస భారతీయులను దృష్టిలో పెట్టుకొని వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గడువు పెంపుపై చివరి రోజైన నేడు ఆర్‌బీఐ నుంచి స్పష్టత వస్తుందా అనేది చూడాలని అంటున్నారు.