రోడ్లు బాగా లేకుంటే టోల్‌ వసూలు చేయొద్దు : కేంద్ర మంత్రి గడ్కరీ

-

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులు నాణ్యంగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్‌ వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఉపగ్రహ ఆధారిత టోల్‌ వసూలుకు సంబంధించిన గ్లోబల్‌ వర్క్‌షాపులో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. నాణ్యమైన సేవలు అందించకుంటే, టోల్‌ వసూలు చేయొద్దని తేల్చి చెప్పారు. టోల్‌ వసూలు మీద చాలా ఆత్రుతతో ఉన్నారన్న ఆయన.. నాణ్యమైన రోడ్లు ఉన్నచోటే ఫీజులు వసూలు చేయాలని చెప్పారు.

గుంతలూ, మట్టితో ఉండే అధ్వానమైన రోడ్లకు టోల్‌ వసూలు చేస్తామంటే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని గడ్కరీ హెచ్చరించారు. ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ).. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి తొలిగా 5వేల కి.మీ పరిధిలో జీఎన్‌ఎస్‌ఎస్‌(గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌) ఆధారిత ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు పద్ధతిని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ పరిధిలోనే ఇది పనిచేస్తుందని వెల్లడించారు. మొదట్లో దీన్ని హైబ్రిడ్‌ విధానం (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌-ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఆధారిత)లో అమలు చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news