దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌ను జాతీయ రహదారిగా ప్రకటించాలి : సీఎం రేవంత్

-

ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల పనులు, సంబంధిత సమస్యలపై చర్చించేందుకు సీఎం బుధవారం దిల్లీలో కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఆర్‌ అండ్‌ బీ అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్.. కేంద్ర మంత్రికి పలు విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని కోరారు. రాష్ట్ర పురోగతికి, చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన అనుసంధానతకు దోహదపడే వివిధ రహదారులను పూర్తి చేసి సహకరించాలని విన్నవించారు. జగిత్యాల-పెద్దపల్లి-మంథని-కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి తగిన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానించే హైదరాబాద్‌-మన్నెగూడ నాలుగు వరుసల జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-163) పనులు వెంటనే ప్రారంభించాలి. దీనికి భూసేకరణ పూర్తిచేసి, టెండర్లు పిలిచినా ఎన్జీటీలో కేసు కారణంగా పనులు ప్రారంభం కాలేదని రేవంత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news