దేశ వ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే జంకుతున్నారు. నాలుగైదు రకాల కాయగూరలు కొందామని మార్కెట్‌కు వెళ్లి.. ధరలు చూసి బిత్తరపోయి ఖాళీ సంచులతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా టమాట, మిర్చి ధరలు చూసి షాకవుతున్నారు. తాజాగా టమాటా గరిష్ఠ ధర రూ.142గా ఉంది. విజయవాడ మార్కెట్లో కిలో టమా రూ.142గా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు మదనపల్లె మార్కెట్లో కిలో టమాట రూ.124 ఉంది. తెలంగాణలోని పలు మార్కెట్లలో రూ.100 నుంచి రూ.120 వరకు కిలో టమాట ధర పలుకుతోంది.
అయితే మండిపోతున్న టమాటా ధరలు 15 రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి పంట మార్కెట్లకు చేరడం, వివిధ ప్రాంతాల నుంచి సరఫరా పెరగడమే దీనికి కారణమన్నారు. మరో నెల రోజుల్లో టమాటా ధరలు సాధారణ స్థాయికి తిరిగి వస్తాయని అంచనా వేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సొలన్, సిర్‌మౌర్ జిల్లా నుంచి దిల్లీకి సరఫరాలు మెరుగైనందున టమాటా ధర తగ్గుతోందని చెప్పారు.