దేశవ్యాప్తంగా ప్రస్తుతం మూడో దశ కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే 45 ఏళ్లకు పైబడిన వారికి టీకాలను ఇస్తున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లను అందజేస్తున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారు అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యసేతు యాప్ ద్వారా
కోవిడ్ టీకాలను వేయించుకున్న వారు ఆరోగ్యసేతు యాప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు ఈ స్టెప్స్‌ను అనుసరించాలి.
1. మీ ఫోన్‌లో ఉన్న ఆరోగ్య సేతు యాప్‌ను అప్‌డేట్ చేయండి.
2. యాప్‌ను ఓపెన్ చేసి అందులో CoWin అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
3. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
4. అక్కడ ఇచ్చిన ఆప్షన్‌లో మీ బెనిఫిషియరీ రిఫరెన్స్ ఐడీని ఎంటర్ చేయాలి.
5. చివరగా గెట్ సర్టిఫికెట్ బటన్‌పై ట్యాప్ చేయాలి.
దీంతో మీరు వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నాక ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇస్తారు. మీ మొబైల్ నంబర్‌కు దానికి సంబంధించిన లింక్ వస్తుంది. దాన్ని సందర్శించడం ద్వారా ఆ సర్టిఫికెట్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అందులోనే రిఫరెన్స్ ఐడీ ఉంటుంది. ఇక రెండు డోసు కూడా వేయించుకుంటే పూర్తి సర్టిఫికెట్ ఇస్తారు. రెండో డోసు వేయించుకున్నా మీ మొబైల్ నంబర్‌కు మెసేజ్ పంపిస్తారు. అందులో ఉండే లింక్‌ను సందర్శించడం ద్వారా కోవిడ్ టీకాను వేయించుకున్నట్లు ఇచ్చే సర్టిఫికెట్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా సర్టిఫికెట్ డౌన్‌లోడ్ అవకపోతే పైన తెలిపిన విధంగా ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా ఆ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకుగాను ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లో ఉండే రిఫరెన్స్ ఐడీని ఎంటర్ చేయాలి.
ఇక కోవిడ్ టీకా తీసుకున్నట్లు ఇచ్చే సర్టిఫికెట్‌లో లబ్ధిదారుడి పేరు, పుట్టిన తేదీ, బెనిఫిషియరీ రిఫరెన్స్ ఐడీ, ఫొటో, వ్యాక్సిన్ పేరు, హాస్పిటల్ పేరు, తేదీ వంటి వివరాలు ఉంటాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ప్రతి ఒక్కరూ కచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను పొందాలి. భవిష్యత్తులో అది కచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఇచ్చే ప్రూఫ్ కనుక అది ఎక్కడైనా పనిచేస్తుంది.