కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు వరదల ధాటికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈనెల పదో తారీఖు శనివారం రాత్రి డ్యాం గేటు చైన్ లింక్ తెగిపోవడం వల్ల 19వ గేటు కొట్టుకుపోవడంతో డ్యామ్ లోని నీరంతా వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో చర్యలకు దిగిన అధికారులు మరమ్మతుల్లో వేగం పెంచారు. గేట్ల పునరుద్ధరణకు కన్నయ నాయుడు నేతృత్వంలో పని ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తుంగభద్ర జలాశయంలో డ్యాం గేటు కొట్టుకుపోయి ప్రవాహం ఉండగానే, స్టాప్‌లాగ్ గేటు అమర్చారు. 5 ఎలిమెంట్లు అమర్చడంలో ఇంజినీర్లు విజయవంతం అయ్యారు. నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ఒక్కో ఎలిమెంటును జాగ్రత్తగా అమర్చి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఐదు ఎలిమెంట్ల ఏర్పాటుతో జలాశయం పూర్తిగా నిండినా, 19వ గేటు నుంచి నీరు దిగువకు వెళ్లే మార్గం లేకుండా ఈ స్టాప్ లాగ్ గేటు ప్రవాహాన్ని అడ్డుకుంటుందని అధికారులు తెలిపారు. జలాశయ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో అత్యంత సాహసంతో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటును పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.