యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్.జి.కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనను అత్యంత పాశవికం, భయంకరమైనంగా పేర్కొంది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రైమ్ సీన్ సంరక్షణలో వైఫల్యానికి పోలీసులను నిలదీసింది. మరోవైపు వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరును తప్పుబట్టింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో బెంగాల్ పోలీసు శాఖ అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించింది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో ఇద్దరు ఏసీపీలపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఇన్‌స్పెక్టర్‌పైనా చర్యలు తీసుకుంది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో దాడి జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వీరిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు బెంగాల్ పోలీసు శాఖ వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తోంది.