తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ముంబై చేరుకుని.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తో సమావేశం అయ్యారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నేను దేశ రాజకీయాల గురించి చర్చించడం కోసం మహారాష్ట్ర వచ్చానని స్పష్టం చేశారు కేసీఆర్.
దేశంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉంది. త్వరలో హైదరాబాద్ రావాలని ఉద్దవ్ ఠాక్రేను కోరుతున్నాను. హైదరాబాద్లో అందరం కలిసి దేశ రాజకీయాలపై దృష్టి పెడదామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు అనేక విషయాల్లో కలిసి పని చేయాల్సి ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర రెండు సోదరరాష్ట్రాలు అని పేర్కొన్నారు సీఎం.