బ్రిటన్ ప్రధాన మంత్రిగా రిషి సునాక్ పదవి చేపట్టినప్పటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇతర దేశాలకు మాత్రం కాస్త ఇబ్బందిగా మారుతున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయంతో భారతీయులు కంగుతిన్నారు. ఇక నుంచి లండన్‌కు వెళ్లాలంటే కాస్త ముందూ వెనక ఆలోచించాల్సి వస్తుందని అంటున్నారు. ఇంతకీ ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ఏంటంటే..?
బ్రిటన్‌కు విపరీతంగా పెరిగిపోతున్న వలసలను అడ్డుకునేందుకు ఉపాధి వీసాను మరింత కఠినతరం చేయాలని రిషి సర్కార్ నిర్ణయించింది. ఇక నుంచి భారీ వేతనాలున్న విదేశీ వృత్తి నిపుణులకే వీసాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. మరోవైపు డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది.
ఈ మేరకు బ్రిటన్ హోంశాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో బిల్లు పెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ కఠిన నిబంధనల వల్ల ప్రస్తుత వలసల్లో 3లక్షల మంది వరకూ తగ్గుతారని అంచనా. ఇక భవిష్యత్తులో విద్యార్థి వీసాలపైనా ఆంక్షలను అమలు చేయనున్నట్లు మంత్రి క్లెవర్లీ వెల్లడించారు.