ఇటీవల ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన గురించి తెలిసిందే. ఈ ఘటన దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ప్రమాదం గురించి తెలియగానే సమీపంలో ఉన్న బహానగా గ్రామస్థులు.. ఆ రాత్రంతా క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రులకు తరలించారు. వారి వల్లే వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గ్రామస్థుల సహాయక చర్యల వల్లే ప్రాణ నష్టం కొంచెం తగ్గిందని అధికారులు ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం రోజున బాలేశ్వర్ జిల్లాలోని బహానగాను సందర్శించారు. తన ఎంపీ అన్‌టైడ్ నిధుల నుంచి రూ.కోటి నిధులు బహానగా ప్రాంత అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైల్వేశాఖ నిధుల నుంచి మరో రూ.కోటిని ఇక్కడి ఆసుపత్రి విస్తరణ, సౌకర్యాలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఘోర రైళ్ల ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులను ఆదుకున్న ఈ ప్రాంత వాసులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పూరీ వచ్చిన అశ్వినీ వైష్ణవ్ జగన్నాథ దర్శనం తర్వాత బహానగా సందర్శించి ప్రస్తుత పరిస్థితి అధ్యయనం చేసి రూ.2 కోట్లు సాయం ప్రకటించారు.