యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ.. తన పదవికి రాజీనామా చేశారు. పదవీకాలం ముగియడానికి అయిదు సంవత్సరాలకు ముందే ఈ అత్యున్నత హోదా నుంచి తప్పుకొన్నారు. స్వచ్ఛందంగా ఆయన వైదొలిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సహా పలు కీలక పరీక్షల్లో గందరగోళం నెలకొంది.
మరోవైపు ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వ్యవహారం రోజురోజుకూ దుమారం రేపుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయానా ఆమెపై కేసు నమోదు చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకుంది. ఇక ముందు ఆమె సివిల్స్ రాయకుండా డిబార్ చేయాలని ఆదేశించింది. ఆమెకు షోకాజ్ నోటీసులను సైతం అందజేసింది. ఈ పరిస్థితుల్లో మనోజ్ సోనీ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. 2029 వరకు ఆయన యూపీఎస్సీ ఛైర్మన్‌గా కొనసాగాల్సి ఉన్నప్పటికీ.. అయిదేళ్ల ముందే తప్పుకున్నారు. గతంలో యూపీఎస్సీ సభ్యుడిగా కొనసాగారు. 2023లో ఛైర్మన్‌గా అపాయింట్ అయ్యారు. అయితే మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. స్వామినారాయణ్ బోధనలను అనుసరిస్తూ అనుపమ్ మిషన్ ద్వారా నిష్కామ యోగిగా మారాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.