కేరళ వయోనాడ్ జిల్లాలోని మెప్పాడి ముండకైలో ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు, ఆ తర్వాత మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అనేక ఇళ్లు ధ్వంసమవ్వడమే గాక పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నారని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటనతో కేరళ సర్కార్ ఆర్మీ సాయం కోరగా స్పందించిన సైనికాదళం.. 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (టిఎ) మద్రాస్ నుండి సెకండ్-ఇన్-కమాండ్ నేతృత్వంలోని 43 మంది సిబ్బందితో కూడిన బృందాన్ని ఘటనాస్థలికి పంపింది. ఇప్పటి వరకు 70 మందికి పైగా గాయపడగా వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు కేరళలోని 4 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వయనాడ్, కోళికోడ్, మలప్పురం, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ , పతనంతిట్ట, అలాప్పుళ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.