సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 సార్వత్రిక ఎన్నికల ముందు పుల్వామా దాడికి ప్రతీకారంగా ముష్కరులకు మన వాయుసేన ముచ్చెమటలు పట్టించింది. పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్‌లో భారత్ జరిపిన వైమానిక దాడులు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. తాజా ఎన్నికల్లోనూ ఈ ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. బాలాకోట్‌పై వైమానిక దాడుల గురించి పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు వెల్లడించామని ప్రధాని మోదీ తెలిపారు. మోదీ ఏది దాచిపెట్టడని.. ఏదైనా బహిరంగంగానే చేస్తాడంటూ ప్రధాని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలోని బగల్‌కోట్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటనను ప్రస్తావించిన మోదీ.. ఇది నవ భారత్.. మనకు హానీ తలపెట్టే ముష్కరులు వారి సొంత దేశంలో నక్కినా వేటాడి మరీ చంపేస్తామని అన్నారు. వెనుక నుంచి దాడి చేయడంపై తనకు నమ్మకం లేదని, శత్రువుతో ఎదురుగా నిలబడే పోరాడుతామని తేల్చి చెప్పారు. 2019 నాటి బాలాకోట్ దాడుల సమాచారాన్ని దాయాది నుంచి దాచిపెట్టాలనుకోలేదని.. దాడి తర్వాత అక్కడ జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందే చెప్పామని ప్రధాని వివరించారు. ఆ దాడుల గురించి పాక్‌కు చెప్పిన తర్వాతే.. ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించామని తెలిపారు.